సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతోంది. కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా మూటముల్లె సర్దుకుంటున్నాయి. తాజాగా ఇండియా బ్లాక్కు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. పంజాబ్‌లో ఉన్న13 సీట్లతో పాటు చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో తమ అభ్యర్థుల్ని బరిలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 10 - 15 రోజుల్లో ప్రకటిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.
ఆప్ ప్రకటనతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని స్పష్టంచేశారు. మరోవైపు కూటమిలో కీలకంగా వ్యవహరించిన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. కమలదళంతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ వరుస షాక్ ల నుంచి తేరుకోకముందే కేజ్రీవాల్ చేసిన ప్రకటన ఇండియా కూటమిలో ఆందోళనకు కారణమైంది.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే సీట్ల పంపకం విషయంలో పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు ఆప్ సిద్ధంగా లేదు. సీఎం భగవంత్ మాన్ కూడా ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్లోనూ ఇండియా కూటమికి షాక్ తప్పేలా కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపిస్తుండగా.. జయంత్ చౌదరీ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ మాత్రం ఎన్డీఏ పంచన చేరేందుకు సిద్ధమవుతోందని బలంగా ప్రచారం సాగుతోంది. ఆ కారణంగానే జయంత్ చౌదరి తాత అయిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు కేంద్రం భారతరత్న ప్రకటించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.