ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఇవాళ్టి విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి కేజ్రీవాల్ తెలిపారు. ఈడీ విచారణకు ఆయన డుమ్మా కొట్టడం ఇది 5వ సారి. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడమే మోదీ ధ్యేయమని మండిపడింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. తాజాగా జనవరి 18న రావాలని తాఖీదులు ఇవ్వగా.. అప్పుడు కూడా విచారణకు డుమ్మాకొట్టి గోవా వెళ్లారు. ఇవాళ హాజరుకావాలని 5వ సారి నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు కూడా హాజరుకావడం లేదు.