శబరిమల భక్తులకు గుడ్​న్యూస్​... దర్శన సమయం పెంపు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-11 01:46 GMT

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిగిరీశుని దర్శన సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు(Travancore Devaswom Board) నిర్ణయం తీసుకుంది. ఆలయం వద్ద రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో దర్శన సమయాలను పొడిగించేందుకు శబరిమల తంత్రి అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు రోజూ సాయంత్రం వేళ 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శించుకుంటుండగా ఇక నుంచి మధ్యాహ్నాం మూడు గంటల నుంచే దర్శించకోవచ్చని దేవస్థానం బోర్డు తెలిపింది. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది.

స్వామి వారి దర్శనం కోసం భక్తులకు 14 గంటల పాటు సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు, రోజుకు 75వేల మంది భక్తులనే అనుమతించాలని టీడీబీని అభ్యర్థించినట్లు ఐజీ స్పర్జన్ కుమార్​ తెలిపారు. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్‌లు, స్పాట్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ఈసారి ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు శబరిమలకు తరలివస్తున్నట్లు వెల్లడించారు. ఎంతో ఆధ్యాత్మికంగా భావించే 18 మెట్లను వారు త్వరగా ఎక్కలేకపోతున్నట్లు చెప్పారు.

మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నవంబర్ 16వ తేదీ సాయంత్రం తెరుచుకుంది. నవంబర్​ 17వ తేదీన స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండల మకరవిళక్కు వేడుకలు కూడా అప్పుడే మొదలయ్యాయి. రెండు నెలలపాటు కొనసాగే మణికంఠుడి మహాదర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈసారి కొండపై భక్తుల సురక్షిత దర్శనం కోసం డైనమిక్ క్యూ-కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

Tags:    

Similar News