అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి తమకు ముస్లింల ఓట్లు వద్దని, తమ పార్టీకి ఓటు వేయమని కూడా వాళ్లను అడగనని తేల్చి చెప్పారు. అస్సాంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. దేశంలో అన్ని సమస్యలు ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లే వస్తున్నాయి. వాటికి తాను దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ముస్లింలు ఓట్లు వేయకున్నా రాబోయే 10 ఏళ్లలో వారి కమ్యూనిటీని అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. మదర్సాలను మూసేసి ముస్లిం ఆడపిల్లల కోసం కాలేజీలు ఏర్పాటుచేశామని తెలిపారు.
‘ఇన్ని ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రతీ విషయాన్ని రాజకీయం చేసింది. ఓట్ల కోసం హడావిడి చేసింది. ముఖ్యంగా ముస్లింల సమస్యలపై ఓటు రాజకీయాలు చేస్తోంది. వాళ్లలా నేను చేయాల్సిన పనిలేదు. నేను నెలకోసారి ముస్లింలున్న ప్రాంతాలకు వెళ్తా. వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతా. అయినా, వాళ్ల అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టను. ఇన్నాళ్లు కాంగ్రెస్ ఓట్ల కోసం ఎలా వాడుకుందో ముస్లింలు అర్థం చేసుకోవాల’ని కోరారు.