Assembly Elections: రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో నవంబర్ 7వ తేదీన 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశలో 76.47 శాతం ఓటింగ్ జరిగింది. మిగిలిన మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. రెండు పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పలు హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్‌లో 2,533 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. బాలాఘాట్, మాండ్లా, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఛింద్వాఢాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆప్, జేడీయూ తదితర పార్టీలు బరిలో ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది. రెండో విడత జరుగుతున్న పోలింగ్‌లో పశ్చిమ రాయ్‌పుర్ స్థానంలో అత్యధికంగా 26 మంది పోటీలో ఉండగా.. డౌండీ లోహారా స్థానంలో అత్యల్పంగా నలుగురు బరిలో ఉన్నారు. రెండోవిడత పోలింగు జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్ 50 చోట్ల గెలుపొందగా, బీజేపీ13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ నాలుగు, బీఎస్‌పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.