Ayodhya Ram Mandir : అయోధ్య దర్శనం నిలిపేసిన అధికారులు.. కారణం ఇదే..!
అయోధ్య రామమందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హిందువుల దశాబ్దాల కల నెరవేరింది. ప్రారంభోత్సవం రోజున కేవలం వీఐపీలకు అనుమతి ఉండగా.. సాధారణ పౌరులకు ఇవాళ్టినుంచి (జనవరి 23) రామ్ లల్లా దర్శనానికిక అనుమతిస్తున్నారు. కాగా నిన్నిటి కార్యక్రమం చూసేందుకు భారీ ఎత్తున రామ భక్తులు అక్కడికి చేరుకోగా.. వారిని ఆలయంలోనికి అనుమతించలేదు. దీంతో స్థానికంగా ఉన్న హోటళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై రాత్రి బస చేశారు. చాలామంది ఇవాళ ఉదయం ఆలయం వైపు ఒక్కరాసిగా పోటెత్తడంతో.. అధికారులు ఉదయం 3 గంట్లకు గేట్లను తెరిచి భక్తులను అనుమతించారు. ఈ విషయం తెలియడంతో లక్షల్లో భక్తులు ఒక్కసారిగా ఆలయంలోనికి ప్రవేశించారు. దీంతో తోపులాట జరిగింది. భక్తులను కంట్రోల్ చేయలేకపోయిన అధికారులు రామమందిర ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపేశారు.
ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో మిగతా భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి చలిలో ఉన్నా.. దర్శనం కోసం అవకాశం కల్పించడంలేదని మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితి కుదుట పడగానే తిరిగి దర్శనం ప్రారంభిస్తామని చెప్తున్నారు.