అయోధ్య విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు అయోధ్యలో పర్యటించనున్నారు. దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో నగర రూపురేఖలు మారుతున్నాయి. ఇటీవలె అయోధ్య ఎయిర్‌పోర్ట్ పూర్తి కాగా.. రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి.. ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించారు. అయోధ్య రామాలయ ప్రారంభానికి ముందు ఈ రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు పేర్లను మార్చారు. అయోధ్యలో నిర్మించిన కొత్త ఎయిర్‌పోర్టు సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలోనే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. అయోధ్య రైల్వే స్టేషన్‌కు అయోధ్య ధామ్ జంక్షన్‌గా పేరు పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ సదుపాయాలు, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వర్షపు నీటిని సంరక్షించడం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు.
ఇక ఎయిర్‌పోర్ట్‌తోపాటు అయోధ్య ధామ్ జంక్షన్ ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, ఇతర వసతుల ప్రాజెక్టులను లాంచ్ చేయనున్నారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన 3 రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. కొత్తగా 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు.