Ayodhya Ram Mandir : అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు

Byline :  Krishna
Update: 2024-01-22 07:14 GMT

5 శతాబ్దాల కల నెలవేరింది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట జరగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ఈ క్రతువును నిర్వహించారు. దాదాపు 84 సెకండ్లలో ఈ మహా క్రతువు పూర్తిచేశారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ రామయ్యకు పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రామ్ లల్లాకు 114 కలశాలలో ఔషధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు  పాల్గొన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా నామ స్మరణతో మార్మోగింది.

రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. అయోధ్యలో ప్రతి చోటా రామ్‌ లీల, భగవద్గీత పారాయణం, రామ భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ మహక్రతువును దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు స్వామీజీలు సహా దాదాపు 7 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యారు.

Tags:    

Similar News