Ayodhya Ram mandir: సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్యకు మరో రికార్డ్
యావత్ దేశం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం దాదాపు పూర్తైంది. దేశంలోని ప్రముఖలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ వేడుకకోసం అయోధ్యను భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా సర్వాంగ సుందరంగా ముస్తాబుచేస్తున్నారు. అయోధ్య అడుగడుగు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఏర్పాటుచేసిన సోలార్ స్ట్రీట్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాధించుకుంది. ఇప్పటికే ఎన్నో విశిష్టతలు నెలకొన్న అయోధ్యలో.. ఇప్పుడు ఈ సోలార్ స్ట్రీట్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ నుంచి నిర్మల్ ఖుండ్ వరకున్న 10.2 కిలోమీటర్ల దూరంలో ఈ స్ట్రీట్ లైట్లను అమర్చారు. ఈ వీధిలో మొత్తం 470 సోలార్ స్ట్రీట్ లైట్లు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్డ్ లైన్ గా అరుదైన రికార్డ్ నెలకొల్పింది.
ఇప్పటికే 70 శాతం స్ట్రీట్ లైట్లను అమర్చడం పూర్తికాగా.. మిగతావాటిని జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవం రోజునాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ను ఉత్తర్ ప్రదేశ్ న్యు అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టింది. ఇదివరకు అయోధ్యలో జరిగిన దీపోత్సవం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మట్టిదీపాలు వెలిగించినందుకు ఈ రికార్డ్ వచ్చింది.