Bajrang Punia : ‘పద్మశ్రీ’ని ప్రధాని నివాసం వద్ద వదిలిపెట్టేసిన బజ్‌రంగ్ పునియా

Byline :  Veerendra Prasad
Update: 2023-12-23 05:19 GMT

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం కుస్తీ పోటీలకు గుడ్‌బై చెబుతున్నట్టు లేడీ రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా ఒలింపిక్ మెడలిస్ట్ బజ్‌రంగ్ పునియా కూడా తన పద్మశ్రీ పతకాన్ని కర్తవ్యపథ్‌లోని ప్రధాని నివాసం సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళలకు న్యాయం చేయలేకపోయిన తాను ఈ మెడల్‌కు అర్హుడిని కానన్నారు. ‘‘నేను గతంలో చెప్పినట్టు మేము మా సోదరీమణులు, కూతుళ్ల కోసం పోరాడుతున్నాం. వారికి నేను న్యాయం చేయలేకపోయాను. కాబట్టి, ఈ గౌరవానికి నేను అర్హుడిని కాను. ఈ అవార్డును తిరిగిచ్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను. అయితే, ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనను కలవలేకపోయాను. ప్రధానికి రాసిన లేఖతో పాటూ మెడల్‌ను కూడా ఇక్కడే వదిలేశాను. దాన్ని వెంట తీసుకెళ్లట్లేదు’’ అని పునియా విలేకరులతో అన్నారు.




 


తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానికి తిరిగిచ్చేస్తానంటూ శుక్రవారం కర్తవ్యపథ్‌‌‌‌లోని ప్రధాని నివాసానికి వెళ్తున్న బజ్‌‌‌‌రంగ్‌‌‌‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, పద్మశ్రీ అవార్డును ప్రధాని ఇంటి ముందున్న ఫుట్‌‌‌‌పాత్​పై పెట్టి వెళ్లిపోయారు. ‘ప్రభుత్వం నుంచి నేను ఈ గౌరవాన్ని అందుకున్నా. అయితే ఈ గౌరవం ఉన్నప్పటికీ నేను ఈ ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడలేకపోయాను. కాబట్టి ఈ అవార్డును ఉంచుకునే అర్హత నాకు లేదు. పీఎంను కలిసేందుకు నేను ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్న దానిలో నిజం ఉంది. అందుకే ఆయనను కలువలేపోతున్నా. పద్మశ్రీ అవార్డును నేలపై ఉంచలేను కాబట్టి ఈ లెటర్‌‌ (మోదీకి రాసిన)పై పెట్టి వెళ్తున్నా. దీన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేను. మహిళా రెజ్లర్ల బాధ ఇంకా మీకు (మోదీ) చేరలేదు. భవిష్యత్తులో అది మీకు చేరినట్లయితే దయచేసి వారికి న్యాయం చేయండి’ అని బజరంగ్ తెలిపారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన బజరంగ్ పూనియా.. మళ్లీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతునట్టు తెలిపారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదని, ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు బజరంగ్‌ పూనియా. మహిళా రెజ్లర్లకు భద్రత లేనందున తనకు లభించిన పద్మశ్రీ అవార్డును ప్రధాని మోడీ కే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో మాకు గొడవ లేదు.. మా పోరాటం ప్రభుత్వంపై కాదు.. ఓ వ్యక్తిపై.. ఈ గొడవను ఆయన రాజకీయం చేశారు.. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే బజరంగ్‌ పూనియా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయడం ఆయన వ్యక్తిగత విషయమని కేంద్ర క్రీడల శాఖ స్పందించింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది




Tags:    

Similar News