Bandi Sanjay Kumar : కరీంనగర్ ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్, గంగుల - బండి సంజయ్
సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలను మోసం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. బీఆర్ఎస్, కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ .. ఎంపీగా ఓడిపోయి 6 నెలలు ఖాళీగా ఉన్న కూతురిని ఎమ్మెల్సీ చేశాడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని బండి సంజయ్ స్పష్టంచేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కబ్జాలకు పాల్పడుతున్నారని.. బీజేపీ మాత్రం పేదల కోసం పోరాటం చేస్తోందని బండి ఆరోపించారు. ప్రజలు ఎవరి వైపు నిలబడతారో తేల్చుకోవాలని సూచించారు. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల కమలాకర్ నెంబర్ వన్ అని విమర్శించారు. బియ్యం టెండర్లలో ఆయన రూ.1300 కోట్లు గోల్ మాల్ చేశాడని ఆరోపించారు. మొదటి తారీఖున జీతాలే ఇవ్వలేని కేసీఆర్కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులని అన్నారు. తనను అవినీతిపరుడంటున్న కేసీఆర్.. అది నిజమైతే తనను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.