మోదీ మాట విని డీపీ మార్చితే.. BCCI బ్లూటిక్ ఎగిరిపోయింది!
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, హర్ ఘర్ తిరంగ అభియాన్ లో భాగంగా దేశ పౌరులంతా.. తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో డీపీలు మార్చి జాతీయ జెండాను ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ ఈ ప్రకటన చేసిన మరుక్షణం బీసీసీఐ తన అదికారిక ట్విట్టర్ అకౌంట్ లో డీపీగా జాతీయ జెండాను ఉంచింది. ఇంకేముంది డీపీ మార్చిన కొద్దిసేపట్లోనే బీసీసీఐ వెరిఫికేషన్ టిక్ ఎగిరిపోయింది. దాంతో అసలేం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. అప్పటివరకు ఉన్న టిక్.. డీపీ మార్చగానే ఎందుకు పోయిందా అని చర్చలు మొదలయ్యాయి. మోదీ వల్లే ఇదంతా జరిగిందని కొందరు అంటున్నారు.
ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్ మార్గదర్శకాల ప్రకారం.. వెరిఫికేషన్ టిక్ కలిగిన ఏ అకౌంట్ అయినా.. తమ ఖాతా ప్రొఫైల్ ఫొటో మార్చిన వెంటనే ఆ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ ఎగిరిపోతుంది. ఆ తర్వాత ట్విట్టర్ మేనేజ్మెంట్ తో రివ్యూ, ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత తిరిగి వెరిఫికేషన్ టిక్ ను పునరుద్దరిస్తారు. కాగా, బీసీసీఐ ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్ కూడా త్వరలో రానుంది.