టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు అర్హులు కాదు.. సుప్రీంకోర్టు

Update: 2023-08-15 05:23 GMT

బీఈడీ అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య బోధించడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఆ శిక్షణ పొందిన వాళ్లే అర్హులని స్పష్టం చేసింది. బీఈడీ చదివిన వాళ్లు కూడా ప్రాథమిక తరగతుల బోధనకు అర్హులేనంటూ ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ) 2018లో ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ఇప్పటికే మండలి నోటిఫికేషన్‌ను కొట్టేయగా, కొంతమంది బీఈడీ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా రాజస్థాన్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది.

అలాంటి విద్యకు అర్థం లేదు

‘‘ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ను అర్హతగా చేరుస్తూ NCTE తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా, అహేతుకంగా కనిపిస్తోంది. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యతలో రాజీపడితే ఉచిత, నిర్బంధ విద్యకు అర్థమే ఉండదు. నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించాలి. డీఎడ్‌ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు చెప్పేలా శిక్షణనిస్తారు. బీఎడ్‌ విద్యార్థులకు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యార్థులకు బోధించేలా శిక్షణ అందుతుంది. కాబట్టి బీఎడ్‌ అభ్యర్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేం. వారిని ఆ పోస్టులకు అర్హులుగా నిర్ణయించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. ‘ఆర్టికల్‌-21ఎ’లో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. కేంద్రప్రభుత్వం వారిని అర్హులుగా ప్రకటించి రాజ్యాంగం, చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఎన్‌సీటీఈ లక్ష్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే తప్ప.. బీఎడ్‌ శిక్షణ పొందినవారికి ఉద్యోగావకాశాలు కల్పించడం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.



Tags:    

Similar News