Bhainsa: ఘోరం.. కోతులను చంపి తిన్నారు.. ట్విస్ట్ ఏంటంటే..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-13 07:47 GMT

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామాల్లో భిక్షాటన చేస్తూ.. సంచారం జీవనం చేసే కొందరు వ్యక్తులు.. దారుణానికి ఒడిగట్టారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే కోతులను పట్టి వాటిని చంపేసి అనంతరం వండుకుని తినేందుకు ప్లాన్ చేశారు. అయితే కోతి మాంసాన్ని కాలుస్తున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి గ్రామ ప్రజల వద్దకు వెళ్లి తన తోటి బిక్షగాళ్లు కోతులను చంపి వండుకుని తింటున్నారని చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

చింతల్ బోరి గ్రామంలో ఉంటూ గత మూడు రోజుల నుంచి భిక్షాటన చేస్తున్నారు సంచార జాతికి చెందిన ఆరుగురు వ్యక్తులు. అడవిలో దొరికే ప్రతిజీవిని చంపి తినే అలవాటున్న వారికి .. పిల్లులను చంపినట్లు.. కోతులను కూడా అదే తరహాలో పట్టి వండుకొన్నట్లు తెలుస్తోంది. కోతులను చంపి.. కాల్చి తినే సమయంలో పంపకాల విషయంలో ఆ ఆరుగురి మధ్య గొడవ జరిగింది. తనకు వాటా తక్కువగా వచ్చిందనే కోపంతో.. గ్రామ ప్రజల వద్దకు వెళ్లి తన తోటి బిక్షగాళ్లపై ఫిర్యాదు చేశాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆ పరిసరాలను చూసి షాక్ అయ్యారు. కోతి తల, కాళ్లు, చేతులను మంటలో కాల్చి తినడానికి సిద్ధం చేసి ఉండటం గమనించి కంగుతిన్నారు. వెంటనే వారిని నిలదీయడంతో చేసిన తప్పును వారు ఒప్పుకున్నారు. వానరాలు తమకు దైవంతో సమానమని.. అలాంటి జీవుల్ని ఎలా చంపి తింటారని గ్రామస్థులు వారిని నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడికి వచ్చే సరికి ఆరుగురిలో నలుగురు వ్యక్తులు పారిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




Tags:    

Similar News