జమిలి ఎన్నికలపై మమత అభ్యంతరం.. కోవింద్ కమిటీకి లేఖ

By :  Kiran
Update: 2024-01-11 12:21 GMT

జమిలి ఎన్నికలపై తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ వైఖరిని ప్రకటించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలకు ఉద్దేశించిన ఒకే దేశం- ఒకే ఎన్నిక భావనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి లేఖ రాశారు. జమిలి ఎన్నికల విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని దీదీ అభిప్రాయపడ్డారు. నిరంకుశత్వానికి తాము వ్యతిరేకమని.. అందుకే జమిలి ఎన్నికలకు దూరమని మమత స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికల ప్రతిపాదనతో విభేదిస్తున్నామని, ఈ కాన్సెప్ట్ స్పష్టంగా లేదని మమత అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఒకే దేశం- ఒకే ప్రభుత్వం అనే భావనను అనుసరించడం లేదని.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాలతో ఐదేళ్లు అధికారంలో ఉండకపోవచ్చని అన్నారు. గత 50 ఏండ్లలో లోక్‌సభ పలుమార్లు ముందస్తుగా రద్దైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ కోసం కేంద్రం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిటీ రెండుసార్లు సమావేశమైంది. ఇప్పటి వరకు 6 జాతీయ, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. అటు న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది. కమిటీకి ఇప్పటి వరకు 5వేలకుపైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు సమాచారం.



Tags:    

Similar News