ఓరీ దేవుడో.. 2 ట్రాలీ బ్యాగుల్లో 200కి పైగా వన్య ప్రాణులు
అరుదైన తాబేళ్లు, పాములు, కొండ చిలువలు, కంగారూ పిల్ల, మొసలి పిల్ల, బల్లులు, ఊసరవెల్లి.. వీటన్నంటిని ఎప్పుడైనా ఒకేసారి చూశారా..? జూ లో సైతం సాధ్యం కానీ ఈ ప్రాణులు అన్నీ.. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాయి. ఏకంగా 234 వన్య ప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి రెండు ట్రాలీ బ్యాగుల నిండా వన్య ప్రాణులను అక్రమంగా తీసుకొస్తున్న ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. ప్లాస్టిక్ బాక్సుల్లో ఈ వన్యప్రాణులను ఉంచి.. వాటికి గాలి ఆడటం కోసం డబ్బాలకు రంధ్రాలు చేశారు.
#IndianCustomsAtWork Bengaluru Air Customs booked a case of smuggling of wild life. 234 wild animals including python,chameleon,Iguana,turtles, alligators &one baby kangaroo were found concealed in 2 trolley bags.Pax arrested and rescued wild animals seized.Investigation underway pic.twitter.com/lp1a93pGPU
— Bengaluru Customs (@blrcustoms) August 22, 2023
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్యాసింజర్ వీటిని ఇండియాకు తీసుకొచ్చాడని కస్టమ్స్ అధికారి తెలిపారు. థాయ్ ఎయిరేషియా విమానం ఎఫ్‌డీ 137 సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఓ ప్రయాణికుడు గ్రీన్ ఛానెల్ దాటి ఎగ్జిట్ వైపు వెళ్తుండగా.. అతడి దగ్గరున్న ఓ ట్రాలీ బ్యాగును అధికారులు తనిఖీ చేయగా.. అందులో వన్యప్రాణులు ఉన్నట్లు గుర్తించారు.అధికారులు ట్రాలీ బ్యాగు తెరిచి చూసే సరికే అందులో ఉన్న కంగారు పిల్ల విగత జీవిగా కనిపించింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో మరో బ్యాగ్ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అందులోనూ వన్య ప్రాణులు ఉన్నాయి. రెండు ట్రాలీ బ్యాగుల్లో కలిపి 234 వన్య ప్రాణులు ఉండటం గమనార్హం. ఇందులో ఉన్న కొన్ని అత్యంత అరుదైన వన్య ప్రాణులు కావడం గమనార్హం. కస్టమ్స్ యాక్ట్ 104 ప్రకారం వన్య ప్రాణులను తెస్తూ పట్టుబడిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.