ట్రాఫిక్ ఎఫెక్ట్.. బెంగళూరుకు ఏటా వేల కోట్ల నష్టం

Update: 2023-08-07 11:18 GMT

ట్రాఫిక్.. ఇది ప్రతి పట్టణాన్ని వేధించే సమస్య. పెరుగుతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. ఇక బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రోడ్డు మీదకు వెళ్తే మళ్లీ ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. అంతలా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పరిస్థితి. ఈ ట్రాఫిక్ వల్ల బెంగళూరు నగరం భారీగా నష్టపోతుందని తాజా నివేదిక తెలిపింది.

బెంగళూరు ట్రాఫిక్పై ట్రాఫిక్ నిపుణుడు ఎంన్ శ్రీహరి అతని టీంతో కలిసి చేసిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం, టైం నష్టం, ఇంధనం వృథా వంటి వాటితో బెంగళూరు నగరానికి ఏటా 19,725 కోట్లు నష్టం వాటిల్లుతున్నట్లు సర్వేల్లో తేలింది. బెంగళూరు నగరంలో దాదాపు 60 ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ.. నష్టం కూడా భారీగానే ఉందని నివేదిక తెలిపింది. జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా రోడ్ల విస్తరణ లేకపోవడం కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమని శ్రీహరి టీం చెప్పింది.

1.5కోట్ల వాహనాలు

ప్రస్తుతం బెంగళూరు నగంలో 1.5కోట్ల వాహనాలు ఉన్నట్లు సర్వే నివేదిక చెబుతోంది. అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు చెప్పారు. బెంగళూరులో 11వేల కిలోమీటర్ల రోడ్డు ఉన్నా.. ఇక్కడి ప్రయాణికుకు ఇది సరిపోవడం లేదని తెలిపింది. నగరానికి రూడియల్ రోడ్లు, రింగ్ రోడ్లు అవసరమని శ్రీహరి టీం వివరించింది.

గడ్కరీతో డీకే భేటీ..

ఇక బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ట్రాఫిక్ సమస్యపై సమగ్ర నివేదిక తయారుచేయాలని గడ్కరీ డీకేకు సూచించారు. ఈ క్రమంలోనే శ్రీహరి బృందం ట్రాఫిక్ సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై నివేదికను అందజేసింది.


Tags:    

Similar News