ఒక్క బైక్‌పై 40 పెండింగ్ కేసులు.. సిగ్గు లేకుండా ఫోటోకు పోజులు

Update: 2023-08-20 08:43 GMT

నూటికి 95శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. హెల్మెట్‌ లేకుండా, మద్యం తాగి వాహనాలు నడపటం, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ, ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని,ట్రిపుల్‌ రైడింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. ఇలా కారణమేదైనా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నేటికీ ఇలాంటి సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు బెంగుళూరు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ బైక్ పై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 40 కేసులు పెండింగ్ లో ఉన్న వ్యక్తిని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు రూ. 12,000 జరిమానాను చెల్లించేలా చేసి , అతని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాళ్లఘట్ట పీఎస్ పరిధిలో ఓ బైకర్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి బైక్ పై పెండింగ్‌లో ఉన్న కేసులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాదాపు 40 ట్రాఫిక్ కేసులు అతడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అతడి హిస్టరీ స్పష్టం చేసింది. పోలీసులు అతణ్ని పట్టుకోని.. అక్కడికక్కడే జరిమానా చెల్లించేలా చేశారు. మొత్తం 40 పెండింగ్ కేసులకు రూ.12000 క్లియర్ అంటూ అతడి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రాఫిక్ చలాన్‌తో సదరు బైకర్ పోజులివ్వడంపై.. నెట్టింట మిశ్రమ స్పందనలు వచ్చాయి. "ఆ నంబర్ ను సాధించినందుకు అతను చాలా గర్వపడుతున్నాడా?"అంటూ ఒకరు.. పదేపదే నేరాలకు పాల్పడిన వ్యక్తి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా రద్దు చేయాలని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

“జరిమానాలు వసూలు చేయడం మీ పని కాదు... అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని మీరు RTOకి సిఫార్సు చేయాలి. అతనికి కౌన్సెలింగ్ ఇవ్వకపోతే, వచ్చే ఏడాది కూడా మీరు అతనితో మరొక ఫోటోను పోస్ట్ చేస్తారు, ”అని మరొక నెటిజన్ తెలిపారు. “ అతని ముఖంలో ఎలాంటి విచారం లేదు. పోలీసులు భారీ జరిమానాలు విధించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. తప్పు చేయడానికి ప్రజలు భయపడాలి ” అంటూ మరొకరు రాసుకొచ్చారు.


Tags:    

Similar News