Naresh Goyal: 'బతకాలనే ఆశ లేదు'.. జడ్జీ ముందు జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడి కన్నీళ్లు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-07 02:45 GMT

హాస్పిటల్ కు వెళ్లడం కన్నా జైలులోనే చనిపోవడం నయమని, జైలులో చనిపోవడానికి అనుమతివ్వండని ఆవేదన వ్యక్తం చేశారు జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(Naresh Goyal). రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్‌ కేసులో నిందితుడైన నరేశ్ గోయల్‌‌ను.. శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుపరచగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్‌ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమె పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. నా శరీరం నాకు సహకరించట్లేదు. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జడ్జీ ముందు చేతులు జోడించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆర్ఠరైటిస్ ఉన్నాయని.. ఆయన బాధపడ్డారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్‌ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్‌లో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థ అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఆయన్ను అరెస్టు చేశారు. జెట్‌ ఎయిర్‌ కోసం కెనరా బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించారని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనివల్ల కెనెరాబ్యాంకుకు రూ.538.62కోట్ల నష్టం జరిగిందనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీని ఆధారంగానే ఈడీ అధికారులు నరేశ్ గోయల్ ను అరెస్టు చేశారు.




Tags:    

Similar News