Bharat Ratna MS Swaminathan: బంగారు పంటలు పండించిన మహోన్నత వ్యక్తికి అత్యుత్తమ పురస్కారం

Update: 2024-02-09 10:59 GMT

భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత దేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న (Bharat Ratna) పురస్కారంతో గౌరవించింది. భారతదేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఎంఎస్ స్వామినాథన్.. వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన తన పరిశోధనలకు గాను భారతరత్న కంటే ముందు మరెన్నో దేశ అత్యున్నత పురస్కారాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులను పొందారు

బాస్మతి రైస్.. స్వామినాథన్ వల్లే

1925లో ఆగస్టు 7వ తేదీన కుంభకోణంలో జన్మించిన MS స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. తల్లిదండ్రులు ఎమ్‌కే సాంబశివన్, పార్వతి తంగమ్మల్. తండ్రి ఎమ్‌కే సాంబశివన్ ఓ సర్జన్. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఎంఎస్ స్వామినాథన్.. తండ్రి ఉన్న రంగంలోకి కాకుండా వ్యవసాయం రంగంలోకి వచ్చారు. జెనెటిక్స్‌పై ఆసక్తితో 1952లో University of Cambridgeలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1954లో యూరప్, యూఎస్‌లోని పలు ఇన్‌స్టిట్యూట్‌లలో అధ్యయనం కొనసాగించారు. కటక్‌లోని Central Rice Research Institute లో పని చేయడం ప్రారంభించారు. ఆయన చదువు సాగిస్తున్న సమయంలోనే భారత్‌లో వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. సరిపడు వనరుల లేక...అమెరికా సహా పలు దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భారత దేశ పరిస్థితిని చూసిన స్వామినాథన్‌.. మరో దేశంపై భారత్ ఆధారపడకూడదని భిన్నమైన వంగడాల తయారీతో పాటు రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఎంత చలినైనా తట్టుకునే హైబ్రిడ్ ఆలుగడ్డల సాగు ఆయన కృషి వల్లే మొదలైంది. మొక్కల్లో జన్యుమార్పులు చేయడం ద్వారా గోధుమలు, బియ్యం భారీ మొత్తంలో పండేలా మార్పులు తీసుకొచ్చారు. బాస్మతి రైస్‌ స్ట్రెయిన్‌ని పరిచయం చేసింది స్వామినాథనే.

పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్.....

1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా స్వామినాథన్ బాధ్యతలు నిర్వర్తించారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా పని చేశారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కు దేశ అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకున్న స్వామినాథన్.. 1971లో రామన్‌ మెగసెసే అవార్డు,1989లో పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డుతోపాటు1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు.

ప్రధాని మోదీ ట్వీట్

1955లో ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. తన 98 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలోని ఆయన నివాసంలో ఎంఎస్ స్వామినాథన్ తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలు, వయోభారం వంటి సమస్యలతో ఆయన మరణించారు. స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం.. హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రధానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని ట్వీట్ చేశారు.



Tags:    

Similar News