రూ.508 కోట్ల ముడుపుల కేసు.. చిక్కుల్లో ఛత్తీస్‌గఢ్‌ సీఎం

Byline :  Veerendra Prasad
Update: 2023-11-06 02:45 GMT

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్‌ బఘేల్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి ముఖ్యమంత్రి భూపేశ్‌ రూ.508 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చేస్తున్న ఆరోపణలకు.. తాజా వీడియో ఒకటి బలం చేకూర్చినట్లయింది.

యాప్‌ యజమానిగా భావిస్తున్న శుభమ్‌ సోని అనే వ్యక్తి.. సీఎం బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో... తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి చెబుతూనే, తనను దుబాయ్ వెళ్లిపొమ్మని సీఎం భూపేశే సలహ ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తానే మహదేవ్‌ యాప్‌కు అసలైన యజమానినని, ఈ యాప్‌ ద్వారా వందలాది కోట్లను ఆర్జిస్తుండటంతో, చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి నుంచి రక్షణకు నేతలను ఆశ్రయించామని చెప్పాడు. అందులో భాగంగానే బఘేల్‌కు పెద్దమొత్తంలో ముడుపులు అందజేసినట్టు తెలిపాడు.

కాగా, మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇప్పటికే ఓ బ్యాంకు ఖాతాలోని రూ.15.9 కోట్లను ఫ్రీజ్‌ చేసిన ఈడీ.. పలువురు బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులపై కేసు పెట్టింది. ఈ క్రమంలో యూఏఈ నుంచి వచ్చిన క్యాష్‌ కొరియర్‌ ఆసిమ్‌దాస్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతని ఇల్లు, కారులో ఉన్న రూ.5.39 కోట్లను సీజ్‌ చేసింది. సీఎం బఘేల్‌ కోసం ఆ మొత్తాన్ని తనకు దుబాయ్‌ నుంచి శుభమ్‌ సోని పంపినట్టు ఆసిమ్‌దాస్‌ ఈడీ వద్ద అంగీకరించాడు. దీంతో అతని సెల్‌ఫోన్‌, శుభ్‌మన్‌ సోని నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌ పరిశీలించగా, ఇప్పటివరకు మహదేవ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి బఘేల్‌కు రూ.508 కోట్లు ముడుపులుగా అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేశాయి. శుభమ్‌ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్‌ చిక్కుల్లో పడ్డారు.




Tags:    

Similar News