దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి
దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలో జరిగిన తొక్కిసలాటలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది వరకూ గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాల్లో సోమవారం రాత్రి జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా గోపాల్ గంజ్ పట్టణంలోని రాజా దళ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రసాదం అందజేసే సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అక్కడ భద్రత సిబ్బంది ఎవరూ లేకపోవడం సహా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావడం తొక్కిసలాటకు దారితీసింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మండప నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతోనే తొక్కిసలాటకు దారితీసిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
ఘటనపై గోపాల్‌గంజ్ ఎస్పీ మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాజా దాల్ పూజా మండపం గేటు సమీపంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.. వేడుకలను చూసేందుకు పరిగెత్తిన ఓ చిన్నారి ఒక్కసారిగా పడిపోయింది. ఈ సమయంలో ఆమెను పలువురు తొక్కుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరు మహిళలు అక్కడకు చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు..కానీ జనాల గుంపులో వారు కూడా చిక్కుకుని ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు.. ఆ మహిళలను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.. స్థానిక మేజిస్ట్రేట్, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.’ అని ఎస్పీ వెల్లడించారు.