BIHAR: బిహార్‌ కుల గణన: లెక్క తేలింది.. 63 శాతం మంది ఆ కులం వారే..

Update: 2023-10-03 03:04 GMT

గాంధీ మహాత్ముడి జయంతి(October 2) రోజైన సోమవారం బిహార్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ అయిన కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. మొత్తం 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో అత్యధికంగా బీసీలే 63 శాతం ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీలు) 36 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు) 27.13 శాతం మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 19.65 శాతం, ఎస్టీలు 1.68 శాతం, జనరల్ కేటగిరీలో 15.52 శాతం మంది ఉన్నట్లు నివేదికలో తెలిపింది. ఈ సర్వే పూర్తయినట్లు ఆగస్టు 25న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించగా.. సోమవారం ఈ మేరకు రిపోర్టును ‘బీహారీ జాతి ఆధారిత్ గణన’ పేరుతో రాష్ట్ర డెవలప్‌‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ రిలీజ్ చేశారు.

కుదరదన్న కేంద్రం..

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు కులగణనను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది.

సర్వే ఇలా జరిగింది..

రాష్ట్రంలో ఓబీసీ కోటా ప్రస్తుతం 27శాతంగా ఉంది. దీనిని మరింత పెంచాలని డిమాండ్​లు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. బిహార్​ కుల గణన డేటా విడుదలవ్వడం ప్రాముఖ్యత సంతరించుకుంది. తొలి దశ సర్వేలో భాగంగా.. ఇళ్లను మార్క్​ చేయడం, ఇంట్లోని కుటుంబసభ్యుల పేర్లను, ఇంటి పెద్ద వివరాలను నమోదు చేయడం జరిగింది. రెండో దశలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చెందిన సామాజిక, ఆర్థిక విషయాలను నమోదు చేశారు. మొత్తం మీద 2.64లక్షల మంది సిబ్బంది.. బిహార్​లో ఇంటింటికీ వెళ్లి కుల గణనను నిర్వహించారు. ఉద్యోగం, విద్య, మారిటల్​ స్టేటస్​, భూమి ఉందా? లేదా? ఆస్థులు, కులం వంటి వివరాలను సేకరించారు.

అన్ని రాష్ట్రాలకు పిలుపు!!

ఈ కుల గణనతో అందరికి ప్రయోజనం ఉంటుందని ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు నితీశ్​ కుమార్​. బలహీన వర్గాలను కలుపుకుని, ప్రగతివైపు నడవొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కులాల ఆధారంగా జనాభాను లెక్కించడం అనే విషయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇందుకు కొందరు మద్దతిస్తుంటే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం నితీశ్​ కుమార్​ మాత్రం.. ఈ తరహా జన గణన చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News