మిజోరంపై కాంగ్రెస్ కేంద్ర మంత్రులు బాంబులు వేశారా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్.. అసలేంటి కథ?

Update: 2023-08-16 03:56 GMT

మణిపుర్ మంటల్లో రాజకీయాలు చలి కాచుకుంటున్నాయి. సామాన్యుల ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుంటుంటే అధికార, విపక్షాలు ఎప్పట్లాగే షరా మామూలుగా తప్పు మీదంటే మీదని దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. బీజేపీ చరిత్రను తవ్వి కాంగ్రెస్‌ను దోషిగా నెలబెట్టే ప్రయత్నం చేస్తోంది. అవన్నీ అబద్ధాలని, ఇప్పుడు చేయాల్సింది హింసను అరికట్టడమని కాంగ్రెస్ అంటోంది. ఈ వివాదంలో కొన్ని ఆసక్తికరమైన పాత విషయాలు బయటికొస్తున్నాయి. ఈశాన్య భారత ప్రజలపై దాడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో విమర్శించడంతో కొత్త వివాదం మొదలైంది. బీజేపీ ఐటీ సెల్ సారథి అమిత్ మాలవీయ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీ

కాంగ్రెస్ నేతలు రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీలు 1966 మార్చిలో మిజోరం రాజధాని ఐజ్వాల్‌పై బాంబులు వేశారని మాలవీయ ఆరోపించారు. అప్పట్లో కరువు పీడీత ప్రజల తరఫున తిరగబడిన మిజో రెబళ్లను అణచడానికి భారత వైమానిక దళం దాడులు చేసింది. వాయిసేనలో పనిచేసిన రాజేశ్, సురేశ్‌లు అందులో భాగంగా బాంబులు వేశారని మాలవీయ ఆరోపణ. ‘‘బాంబులు వేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీలై మంత్రులయ్యారు. సొంతదేశంలోని ఈశాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినందుకు కాంగ్రెస్ వారికి మంచి ప్రతిఫలం ముట్టజెప్పింది’’ అని ట్వీట్ చేశారు.

ఎలా సాధ్యం?

దీనిపై రాజేశ్ పైలెట్ కొడుకు, కాంగ్రెస్ నేత సచినల్ పైలట్ తీవ్రంగా స్పందించారు. మాలవీయ పచ్చి అబద్ధాలాడుతున్నారని, తన తండ్రి మిజోరంలో బాంబులు వేయలేదని అన్నారు. ‘‘మా నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది 1966 అక్టోబరులో. బాంబులు వేశారంటున్నది మార్చిలో’’ అంటూ తన తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో చేరినప్పటి సర్టిఫికెట్‌ను ట్వటర్లో పోస్ట్ చేశాడు. ‘‘తప్పుడు తేదీలు, అబద్ధాలు. వాయుసేన సైనికుడిగా మా నాన్న బాంబులు వేసింది నిజమే. కానీ మిజోరంలో కాదు. 1971 నాటి భారత పాక్ యుద్ధంలో భాగంగా తూర్పు పాకిస్తాన్‌లో వేశాడు’’ అని వివరించాడు. రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీలు పైలట్ కొలువులు వదిలేసి రాజకీయాల్లో చేరి, పీవీ నరసింహారావు హయాంలో కేంద్రమంత్రులయ్యారు. పైలట్ 2000లో రోడ్డు ప్రమాదంలో చనిపోగా, సురేశ్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News