Kishan Reddy : మా అభ్యర్థులను ఆలస్యంగానే ప్రకటిస్తాం.. అదే మా స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-10-09 06:27 GMT

రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వచ్చినా.. బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ ఎన్నికల స్ట్రాటజీలో భాగమని.. ఇప్పటికే 50 శాతం వరకు పూర్తి చేసినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇప్పటికే రెండు సార్లు తెలంగాణకు వచ్చారని.. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులూ త్వరలో మరింత మంది ఇక్కడికి ప్రచారానికి రాబోతున్నారని చెప్పారు. ఇప్పటికే అనేకమంది బీజేపీ చేరుతున్నారని.. ప్రజలు కూడా కమలం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైల్వే సర్వీసులను పొడిగించింది. కాజీపేట్, రాయచూర్, కర్నూల్ సిటీ, బోధన్ స్టేషన్లకు రైల్వే సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు కొత్త సర్వీసులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం జెండా ఊపి ప్రారంభించారు. పూణె – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్ వరకు.. నాందేడ్ – తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్ వరకు పొడిగించారు అధికారులు. జైపూర్ – కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ సిటీ వరకు పొడిగించారు. కరీంనగర్ – నిజామాబాద్ ప్యాసింజర్ రైలును బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. నేడు జెండా ఊపి ప్రారంభించారు. 

నాలుగు రైల్వే సర్వీసులను ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్‌ వస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్‌ ఉన్నాయని.. ఈ ఫేజ్‌లో కొత్త మార్గాలను వేగంగా పూర్తిచేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగిస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేసినట్లు.. తెలంగాణ సర్కార్ సహకారం ఉంటే త్వరగా పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రైల్వే మ్యానుఫ్యాక్చర్‌ యూనిట్‌కు భూమిపూజ చేసుకున్నామని..ఆర్‌ఎంయూ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 




Tags:    

Similar News