Amit Shah : బిహార్ పాలిట్రిక్స్.. అమిత్ షా నివాసంలో కీలక భేటీ
బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన కూటమిని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి ఆయన బీజేపీతో జతకట్టనున్నట్లు ప్రచారం జరగుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సోనియా ఫోన్ చేసిన నితీష్ స్పందించలేదు. ఇవాళ లేదా రేపు నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. అటు ఆర్జేడీ సైతం అధికారం కోసం పావులు కదుపుతోంది.
మరోవైపు బిహార్ రాజకీయాలతో బీజేపీ అలర్ట్ అయ్యింది. అమిత్ షా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనను సైతం క్యాన్సిల్ చేసుకున్నారు. ఏ క్షణాన్న ఎటువంటి నిర్ణయమైన తీసుకునేందుకు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తో షా భేటీ అయ్యారు. బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. జేడీయూతో మళ్లీ కలవడం వల్ల వచ్చే లాభనష్టాలు, ఆ పార్టీ వెంట వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు.
బీజేపీతో జతకట్టనున్న నితీష్.. ఇవాళ లేదా రేపు సీఎంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆది లేదా సోమవారం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీయూ 45, ఆర్జేడీ 79, బీజేపీకి78, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ దాటాలంటే 122 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే ఎలాగైన అధికారం దక్కించుకోవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినా.. ఇంకా 8మంది సభ్యులు ఆ పార్టీకి తక్కువగా ఉన్నారు. దీంతో అధికారం కోసం లాలూ పావులు కదుపుతున్నారు.
ఇండియా కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మమతా బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించగా.. ఇప్పుడు నితీష్ సైతం దూరమవుతున్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిమాణాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కమిటీ కన్వీనర్ లేదా ప్రధాని అభ్యర్థి స్థానాన్ని నితీష్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండిటిని ఆయనకు దక్కకుండా చేసింది. మరికొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర బిహార్లోకి ప్రవేశించనుంది. అయితే ఆ యాత్రకు దూరంగా ఉంటానని నితీష్ ప్రకటించారు.