సముద్రంలోకి దూకిన ఎమ్మెల్యే.. ఎందుకంటే..

Update: 2023-06-01 06:05 GMT

పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అదే సమయంలో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీది.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన బుధవారం పట్వా గ్రామం సమీపంలో జరిగింది.



జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి.. పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు బుధవారం వెళ్లారు. అయితే స్నానం చేయడం కోసమని కల్పేష్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే నలుగురు యువకులు అదే సమయంలో సముద్రంలో దిగారు. అయితే అకస్మాత్తుగా ప్రవాహం తీవ్ర స్థాయిలో రావడం, పెద్ద గాలి వీయడంతో వీరంతా సముద్రంలోకి జారిపోయారు. తమను కాపాడాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. సముద్రం ఒడ్డున ఉన్న చాలా మంది దీనిని గమనించారు.




అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి వెంటనే సముద్రంలోకి దూకి, కొట్టుకుపోతున్న నలుగురిలో ముగ్గుర్ని కాపాడగలిగారు. వీరిని ఓ పడవలోకి ఎక్కించి, ఒడ్డుకు చేర్చారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జీవన్ గుజారియా అనే యువకుడు అలల వేగానికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. బుధవారం సాయంత్రం అతని మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. 



Tags:    

Similar News