Ramesh Bidhuri :ముస్లిం ఎంపీని తిట్టిన రమేష్ బిధూరీకి ప్రమోషన్..

By :  Kiran
Update: 2023-09-28 11:38 GMT

"పార్లమెంట్ స్పెషల్ సెషన్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీకి ఆ పార్టీ ప్రమోషన్ ఇచ్చింది." (BJP Mp Ramesh Bidhuri) ఆయన చేసిన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా.. పార్టీ హైకమాండ్ మాత్రం కీలక బాధ్యతలు అప్పగించింది. రమేష్ బిధూరీకి జైపూర్‌ టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై స్పందించిన డానిష్ అలీ తాను చెప్పిందే జరిగిందని అన్నారు. తనపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ హైకమాండ్ బిధూరీకీ ఇచ్చిన బహుమతి ఇది అని అభిప్రాయపడ్డారు.

పార్లమెంట్‌లో రమేష్ బిధూరీ చేసిన కామెంట్లపై స్పందించిన బీజేపీ హైకమాండ్ ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించింది. తాజాగా ఆయనపై చర్యలు తీసుకోవడం మాట అటుంచితే టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన బిధూరీ టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగింటిలో ఒక చోట కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే పార్లమెంటులో తనపై చేసిన వివాదాస్పద కామెంట్లపై గతంలో స్పందించిన డానిష్ అలీ ఎంపీలను మతపరంగా దూషించడానికే స్పెషల్ సెషన్ నిర్వహించారని విమర్శించారు. బిధూరీ వ్యాఖ్యలకు బీజేపీ ఆయనను శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని అన్నారు. తాజాగా ఆయన చెప్పిందే నిజమైంది. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ స్పందించారు. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందని విమర్శించారు. ఆ జిల్లాలో 30 శాతం మంది ముస్లింలు ఉన్నందునే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందని మండిపడ్డారు.

Tags:    

Similar News