ధరణిని రద్దు చేస్తాం, సుఖపడుతున్నది కేసీఆర్ ఫ్యామిలీనే... బీజేపీ చీఫ్ నడ్డా
బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తొమ్మిదేళ్ల పాలనలో మోదీ బడుగు బలహీన ప్రజల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నడ్డా ఆదివారం నాగర్‌కర్నూల్ పట్టణంలో నిర్వహించిన ‘మహాజన్ సంపర్క్ అభియాన్ బీజేపీ నవసంకల్ప సభ’లో పాల్గొని ప్రసంగించారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల పార్టీ అన్నారు.
‘‘మోదీ హయంలో దేశం ముందుకు వెళ్తుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ పాలనలో జనం నానా బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు మాత్రమే సుఖంగా ఉన్నారు. తెలంగాణ కోసం మేం ఎంతో సాయం చేసినా చేయలేదని అబద్ధాలాడుతున్నారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.4,400 కోట్లు ఇచ్చాం. మెగా టెక్స్‌టైల్స్ పార్కు కేటాయించాం. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌ను వచ్చింది. సికింద్రాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశాం. ఇదంతా మోదీ చలవే’ అని అన్నారు. భూవివాదాలకు, అక్రమాలకు కారణమవుతున్న ధరణి పోర్టల్ తోపాటు ‘బీఆర్ఎస్ పోర్టల్’ ను చేస్తామన్నారు.
మోదీ హవాను విపక్షాలు అడ్డుకోలేవని, పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ ఫోటో సెషన్ తప్ప మరేమీ కాదని నడ్డా ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ అవినీతి పార్టీలు, కులం, కుటుంబ వారసత్వాలతో కుళ్లిపోతున్న పార్టీలు ఫొటో సెషన్. తొమ్మిదేళ్ల బీజేపీ హయాంలో పేదరికం 10 శాతానికి పడిపోయింది. 4కోట్ల మందికి ఇళ్లు వచ్చాయి’’ అని ఏకరవు పెట్టారు. రైతులకు రూ.6 వేలు అందిస్తున్నామని, దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లడాని ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.