ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు..కేజ్రీవాల్
బీజేపీపై నిప్పులు చెరిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. తన ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బెదిరించారని..అంతేగాక కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీలో చేరేందుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని వివరించారు. ఇటీవల ఢిల్లీలోని తన 7 మంది ఎమ్మెల్యేలను సంప్రదించి 'కొద్ది రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి..ఆ తర్వాత ఎమ్మెల్యేలపై విరుచుకుపడతామని బెదిరించినట్లు తెలిపారు. అంతేగాక ఇతరులతో కూడా సంప్రదింపులు చేసినట్లు చెప్పారు. 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు బీజేపీ పేర్కొన్నప్పటికీ, తమ సమాచారం ప్రకారం..వారు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని వెల్లడించారు. బీజేపీ కుట్రలకు తన నేతలు లొంగలేదని వారందరూ బీజేపీలో చేరేందుకు నిరాకరించారని కేజ్రీవాల్ తెలిపారు.
మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి తనను అరెస్టు చేయడం లేదని, అయితే వారు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ‘‘గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు పన్నిప్పటికీ..అవి ఏ మాత్రం ఫలించలేదని చెప్పారు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ తనకు తనపార్టీ నేతలకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు. తన ఎమ్మెల్యేలంతా కూడా గట్టిగానే కలిసి ఉన్నారని...ఈ సారి కూడా కాషాయ నేతలు తమ దుర్మార్గపు ఉద్దేశాలలో కచ్చితంగా విఫలమవుతారని తేల్చి చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఎంత పని చేసిందో బీజేపీకి తెలుసని కేజ్రీవాల్ అన్నారు.