తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఒక్కో రోజు నాలుగైదు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సైతం రాష్ట్రంలో ప్రచార ఉద్ధృతి పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 23 నుంచి పార్టీ జాతీయ స్థాయి నేతలంతా రాష్ట్రానికి క్యూ కట్టనున్నారు. వరుస సభల్లో పాల్గొని క్యాంపెయినింగ్ హోరెత్తించనున్నారు.
ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మిజోరం, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుంది. దీంతో బీజేపీ పెద్దలంతా తెలంగాణపై దృష్టి సారించనున్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకు ఈ నెల 23 నుంచి ప్రచారానికి చివరి రోజైన 28 వరకు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. 5 రోజుల్లో 50 సభలు నిర్వహించేలా బీజేపీ ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది.
ఈ నెల 23 నుంచి 25 వరకు ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఆయన సుడిగాలి పర్యటనలతో హోరెత్తించనున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.