Mamata Banerjee: ఎన్నిక‌ల్లో గెలిచేందుకే బీజేపీ అంద‌ర్నీ జైలుకు పంపుతోంది : మ‌మ‌తా బెన‌ర్జీ

Byline :  Veerendra Prasad
Update: 2024-02-01 16:33 GMT

రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేస్తున్నారని, జైలుకు పంపాలని చూస్తోందని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) విమ‌ర్శించారు. భూకుంభ‌కోణం కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను (Hemanth Soren) ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. గురువారం న‌దియా జిల్లాలోని సంతిపుర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న దీదీ... తనను జైల్లో పెట్టినా అశ్చర్య పోనవసరం లేదన్నారు. ఒక‌వేళ త‌న‌ను కూడా బీజేపీ జైలుకు పంపిస్తే, తాను జైలు నుంచి మ‌ళ్లీ తిరిగి వ‌స్తాన‌ని అన్నారు. కేవలం ఎన్నికల్లో విజయం కోసమే బీజేపీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందే పశ్చిమబెంగాల్‌లో జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోనని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపైనా కేంద్రం అసత్యాలు చెబుతోందని విమర్శించారు. ఇవన్నీ వాళ్ల రాజకీయ ఎత్తుగడల్లో భాగమేనని, ప్రజలను విభజించేందుకే ఇలాంటి కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టాల‌ని త‌మ‌కు ఉంద‌ని, కానీ ఆ పార్టీ త‌మ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన‌ట్లు సీఎం దీదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్‌ సహా, ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

Tags:    

Similar News