సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో బిజీ అయ్యాయి. టార్గెట్ బీజేపీ ఇప్పుడు విపక్షాల లభ్యం ఇదే. ఈ దిశగా అడుగులు వేస్తున్న ప్రతిపక్షాలు బెంగళూరు వేదికగా సమావేశమై బీజేపీని గద్దె దించడంపై చర్చలు జరిపాయి. ఇండియా పేరుతో కూటమికి కొత్త పేరు పెట్టారు. ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సైతం భాగస్వామ్యపక్షాలతో కలిసి భేటీకి సిద్ధమైంది. ప్రధాని మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ పక్షాలు సమావేశం కావడం ఇదే తొలిసారి.
1998లో ఎన్డీఏ ఏర్పాటు
1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాలతో కలిపి నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పేరుతో కూటమి ఏర్పాటు చేసింది. 2004 వరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపింది. ఇక 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం సాధించింది. దీంతో ఎన్నికలకు ముందు వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ అధికారం చేపట్టాక మాత్రం వాటి పేరెత్తిన పాపానపోలేదు. ఎన్నికల్లో గెలుపు క్రెడిట్ అంతా మోడీ ఖాతాలోనే పడింది. దీంతో ఎన్డీయే కూటమి నుంచి ఒక్కో మిత్రపక్షం దూరమవడం మొదలైంది.
దూరమైన మిత్రులు..
ఎన్డీయే కూటమి నుంచి ఒక్కొక్క మిత్రపక్షం ఒక్కో కారణంతో దూరమవడం మొదలైంది. శివసేన, తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (యునైటెడ్) తదితర బలమైన ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నాయి. ఇటీవలే శివసేనలో ఏర్పడిన చీలిక ఒక వర్గం మళ్లీ ఎన్డీయే గూటికి చేరినా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకం. మిత్రపక్షాలు దూరమవడంతో ఎన్డీఏ బలం కాస్త తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ జపం చేస్తే మరింత నష్టపోయే అవకాశముందని గ్రహించిన బీజేపీ మళ్లీ మిత్రపక్షాలను మంచి చేసుకునే పనిలో పడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ రాష్ట్రాల్లో పొత్తులు చిత్తు
గత సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకుంది. ఫలితంగా 48 లోక్‌సభ స్థానాల్లో కూటమి 41 చోట్ల గెలుపొందింది. కానీ ఇప్పుడు శివసేన చీలికవర్గంతో కలిసి పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచే పరిస్థితి లేదు. బీహార్‌లో గత ఎన్నికల్లో జేడీయూ - బీజేపీ కలిసి పోటీ చేసి మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో 39 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే జేడీయూ ఎన్డీయే నుంచి బయటికొచ్చి ఆర్జేడీ - కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడా పొత్తులు బెడిసికొట్టాయి. ఈ రాష్ట్రంలో చిన్న పార్టీలను కలుపుకుని పోటీ చేసినా 40కి 39 సీట్లు గెలుపొందే పరిస్థితి లేదు.
పరిస్థితులు తారుమారు
2019 లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ 28కు గానూ 25 సీట్లలో పాగా వేసింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించగా.. బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆ 25 స్థానాలు నిలబెట్టుకోవడం అసాధ్యమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్‌లో 42 సీట్లకు గత ఎన్నికల్లో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలను సాధించినా ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితులు కాషాయదళానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు.
కొత్త పొత్తులకు సిద్ధం
బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ ఒకటి. కానీ ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లో సాధించే సీట్లతోనే కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో సొంత బలంలేని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతోనైనా పొత్తులు పెట్టుకోవడమే బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయం. దీంతో ఇంతకాలం అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగా బలపడాలన్న ప్రయత్నాలతో పొత్తు రాజకీయాలను పక్కనపెట్టిన బీజేపీ పెద్దలు తాజాగా పొత్తులకు సిద్ధమయ్యారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిపక్ష కూటమిలో చేరని పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో ఎన్డీఏ లిస్టులో పాత మిత్రులతో పాటు కొత్త స్నేహితులను చేర్చుకుంటున్నారు. మొత్తమ్మీద ఇంతకాలం మోడీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవన్న విషయం అవగతమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇంతకాలం దూరం పెట్టిన మిత్రపక్షాలను ఎన్డీఏ సమావేశం పేరుతో మళ్లీ మచ్చిక చేసుకునే పనిలో పడిందన్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.