అనూహ్య ఘటన.. కోర్టు హాలులోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జడ్జి..

Update: 2023-08-04 16:37 GMT

బాంబే హైకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అప్పటి వరకు వివిధ కేసులకు సంబంధించి వాదనలు విన్న ఓ జడ్జి ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయం కోర్టు హాలులో ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్‌ రోహిత్‌ డియో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాగ్‌పుర్‌ లోని బాంబే హైకోర్టులోని బెంచ్‌ కోర్టు హాలులో ఈ ఘటన జరిగింది. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని అందుకే రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ రోహిత్‌ డియో ప్రకటించారు.

‘‘కోర్టులో ఉన్న మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. ఎన్నోసార్లు మీపై ఆగ్రహం వ్యక్తం చేశాను. మిమ్మల్ని బాధపెట్టాలని అలా చేయలేదు. మీరు మరింత మెరుగపడాలనే అలా అన్నాను. మీరంతా నా కుటుంబసభ్యుల్లాంటివారు. మీకు ఈ విషయం చెబుతున్నందుకు నన్ను మీరంతా క్షమించాలి. నేను నా పదవికి రాజీనామా చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టపడి పనిచేయాలి’’ అని జస్టిస్‌ రోహిత్‌ డియో కోర్టు హాలులో చెప్పారు.

వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు జస్టిస్‌ రోహిత్‌ డియో మీడియాకు చెప్పారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను జస్టిస్‌ రోహిత్‌ డియో గతేడాది నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవిత ఖైదును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు నాగ్‌పుర్‌-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి జనవరి 3న మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై జస్టిస్‌ రోహిత్‌ డియో గతవారం స్టే విధించారు. 2025 డిసెంబరుతో జస్టిస్‌ రోహిత్‌ డియో పదవీకాలం ముగియనుండగా రెండేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.



Tags:    

Similar News