పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. బోర్డర్‌లో గ్రాండ్ వెల్‌కమ్
ఇండియన్ కుర్రాడిని పెళ్లాడేందుకు పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓ యువతి భారత్‌లో అడుగుపెట్టింది. వాఘా-అట్టారి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఆమె భారత్‌కి వచ్చి రాగానే.. కాబోయే భర్త , అతడి కుటుంబ సభ్యులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. డోలువాయిద్యాలతో, బాజా భజంత్రీలతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆ యువకుడి కుటుంబసభ్యుల ప్రేమకు ఆ యువతి ఉబ్బితబ్బిబవుతూ.. భారత్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఎల్లలెరుగని వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ అనే యువతి ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్ వీసా దక్కింది. అమృత్‌సర్ నుంచి కోల్‌కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది.
వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో నిశ్చయమైంది. గతంలో రెండు సార్లు వీసా తిరస్కరణకు గురయ్యిందని, అదృష్టం కొద్ది మూడోసారి వీసా మంజూరైందని జావెరియా మీడియాకి తెలిపింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా ఐదేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు భారత్‌లోకి ప్రవేశించాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు వచ్చిన వెంటనే చాలా ప్రేమ, ఆప్యాయతలు లభిస్తున్నాయని ఖానుమ్ చెప్పింది. పాకిస్థాన్‌లోని తన ఇంటి వద్ద అందరూ చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించింది. ఇక జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు.