మహిళా రెజ్లర్ల వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌కి తాను చేసేది తప్పు అని తెలిసినా.. వెనక్కి తగ్గలేదని కోర్టుకు తెలిపారు. తజికిస్తాన్లో ఓ మహిళా రెజ్లర్తో బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
‘‘ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు తజికిస్థాన్ వెళ్లిన ఓ మహిళ రెజ్లర్తో బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించారు. తన గదికి పిలిపించుకుని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఓ తండ్రిగా చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు. ఈ విషయాన్ని బాధితురాలు మాకు చెప్పింది. ఇదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్ చెప్పింది. ఇదంతా బ్రిజ్ భూషణ్ కావాలనే చేశాడు’’ అని కోర్డుకు పోలీసులు వివరించారు.
గతంలో ఈ కేసులో విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీ బ్రిజ్ భూషణ్‌ని నిర్దోషిగా తేల్చలేదని.. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో వాదించారు. కాగా మహిళా రెజ్లర్ల చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అందులో ఏముందన్నది బయట పెట్టలేదు. కేవలం ఢిల్లీ పోలీసులకు మాత్రమే ఆ కాపీ అందించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు రుజువైతే బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.