Nagarkurnool MP: కాషాయ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎంపీ రాములు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-29 11:38 GMT

లోక్‌సభ ఎన్నికల వేళ మరో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీని వీడారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు.. గురువారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. గురువారం తన కుమారుడు భరత్‌తో కలిసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్.. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు లోక్ నాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిలు బీజేపీలోకి చేరారు.

ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ మచ్చలేని మనిషి ఎంపీ రాములు అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని, అది మునిగిపోయిన పడవ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన భరించలేక ప్రజలు ఓడించారన్నారు. ఎంపీ రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరం అవుతాయని వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ చేసిన సంక్షేమ పథకాలే.. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్మణ్, డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇంకా చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతోందని తెలిపారు. మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని జోస్యం చెప్పారు.

కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. భరత్‌ ప్రసాద్‌కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకే ఆయన ఆ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా ఆ పార్టీ కీలక నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. దీనిపై అధిష్టానంతో పాటు గులాబీ బాస్ కేసీఆర్ కూడా మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తోంది.

Tags:    

Similar News