Mayawati : తన రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ చీఫ్ మాయావతి

Byline :  Krishna
Update: 2023-12-10 08:31 GMT

బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్ మాయావతి తన వారసుడిని ప్రకటించారు. లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ పేరును ప్రకటించారు. ప్రస్తుతం ఆకాష్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. మాయావతి తమ్ముడి కొడుకైన ఆకాష్ లండన్లో ఎంబీఏ చేశారు. 2017లో సహరాన్‌పూర్‌లో జరిగిన సభ ద్వారా ఆనంద్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.




 


2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ఆనంద్ ప్రచారం చేశారు. బీఎస్పీలో మాయావతి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా అతడు గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రతోపాటు.. ఇటీవల డా. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్‌ యాత్రలోనూ ఆకాష్ కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ప్రస్తుతం యూపీలో బీఎస్పీ అంతగా ప్రభావం చూపించడం లేదు. ఈ క్రమంలో అధ్యక్ష మార్పు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంతమేర కలిసి వస్తుందో చూడాలి. 


Tags:    

Similar News