వరదలో కోటి రూపాయల ఎద్దు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

Update: 2023-07-15 11:27 GMT

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతంలో భారీగా వరద చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు సైతం వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. దీంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

నోయిడాలో వరద నీటిలో చిక్కుకున్న మూగజీవాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ వరద నీటిలో చిక్కుకున్న మూడు పశువులను సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఈ మూడింటిలో ఇండియా నెం.1 బుల్ ప్రీతమ్ కూడా ఉంది. ఈ విషయాన్ని ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్లో తెలిపింది. ప్రీతమ్ ధర కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.

యమునా నది వరదలు ముంచెత్తడంతో నోయిడా ప్రాంతంలో 5వేల మంది నిరాశ్రయులు అయ్యారు. వరదలో చిక్కుకున్న సుమారు 6వేల జంతువులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. యమునాకు వరద ఉధృతి తగ్గిన పరిస్థితి ఆందోళనగానే ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. సహాయక బృందాల రెస్క్యూ కొనసాగుతుంది.



Tags:    

Similar News