మహాత్మా గాంధీ వారసత్వ సంపద.. బుల్డోజర్లతో నేలమట్టం

Update: 2023-08-14 02:27 GMT

రాష్ట్రాభివృద్ధికి బుల్డోజర్లు, ఆధునిక యంత్రాలు అవసరమని చెప్పుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని యూపీలో మరోసారి బుల్డోజర్లు అధికారులు చెప్పినట్లు విన్నాయి. అయితే ఈసారి అక్రమార్కుల నివాసాలు కాకుండా.. ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదను కూల్చివేశాయి. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను పంపినా.. ఈ కూల్చివేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. వారణాసిలో ఉన్న గాంధీయన్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అడ్డువచ్చిన గాంధేయవాదులను అదుపులోకి తీసుకుని ఆ ప్రాంగణంలో స్వతంత్ర సమరయోధుడు జయప్రకాశ్‌ నారాయణ సహవ్యవస్థాపకునిగా ఏర్పాటు చేసిన గాంధీ విద్యా సంస్థాన్‌ సహా పలు భవనాలను కూల్చివేసింది.

ఈ భవనాలకు చెందిన స్థలం తమదేనంటూ రైల్వే శాఖ వాదిస్తుండగా, దీనిని తాము అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని గాంధేయవాదులు చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు, అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా రైల్వేకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో వారు పోలీసు భద్రత మధ్య ఈ భవనాలను కూల్చివేశారు. కాగా, ఈ కూల్చివేతలను ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌లు దేశంలో మహాత్ముని పేరును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, సర్వసేవా సంఘ్‌ గేటు వద్ద నిరసన తెలుపగా.. పది మంది గాంధేయవాదులను అరెస్టు చేశారు. కూల్చివేతలు చరిత్రలో అవమానకర సంఘటనగా నిలిచిపోతుందని సర్వసేవా సంఘ అధ్యక్షుడు చందన్‌ పాల్‌ విమర్శించారు. మరో అధినేత రామ్ ధీరాజ్ అరెస్టుకు ముందు విలేకరులతో మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు భారతీయ రైల్వేలు గాంధీని లక్ష్యంగా చేసుకోని చెత్త రాజకీయాలకు పాల్పడ్డాయి. రైల్వేతో సంఘ్ భూ ఒప్పందం అక్రమమని వారు నకిలీ డాక్యుమెంట్స్ సాయంతో కోర్టులో నిరూపించారు" అని అన్నారు. అయితే తాము కోర్టు ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నామని కూల్చివేతల్లో పాల్గొన్న వారణాసి కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. గాంధీ విద్యా సంస్థాన్‌ను ఖాళీ చేయాలని కోరుతూ సర్వసేవా సంఘ్‌కు ప్రభుత్వం మేలో నోటీసు ఇచ్చింది. దానిని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) ఆధీనంలో ఉందని గాంధేయవాదులు ఆరోపిస్తున్నారు.





Tags:    

Similar News