క్యాబ్‌లో 'ఆమె' పర్సనల్ కాల్.. బ్లాక్ మెయిల్‌ చేసి 'నిలువు దోపిడీ'

Update: 2023-08-03 03:55 GMT

తన క్యాబ్ ఎక్కిన మహిళను నిలువునా మోసం చేశాడో ఓ క్యాబ్​ డ్రైవర్(Cab driver). అవకాశం తీసుకొని.. తన చిన్నప్పటికి క్లాస్​మేట్​లా నమ్మించి రూ.22 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా 750 గ్రాముల బంగారాన్ని బెదిరించి( blackmails passenger ) తీసుకున్నాడు. క్యాబ్ ఎక్కాక బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిన మాటలే ఆమె కొంపముంచాయి. కనిపించని నగల గురించి భర్త నిలదీయడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో ఈ ఘటన జరిగింది.




 


ఇదీ జరిగింది..

బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోన్న మహిళ... 2022 డిసెంబర్​లో ఇందిరానగర్ నుంచి బాణసవాడి వరకు క్యాబ్​ను బుక్​ చేసుకుంది. కారెక్కిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడికి పర్సనల్ కాల్ చేసి మాట్లాడింది. ఆమాటలు మొత్తం విన్న క్యాబ్ డ్రైవర్ కిరణ్​.. కొద్ది రోజుల తరువాత ఆమెకి మెసేజ్​ చేశాడు. చిన్నప్పటి క్లాస్​మేట్​​ అంటూ పరిచయం పెంచుకొని.. కొన్నిరోజులకు ఫోన్​ చేసి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. రూ.22 లక్షల సాయం కావాలని కోరాడు. దీంతో క్యాబ్​ డ్రైవర్​ కిరణ్(Cab driver Kiran) మాటలు నమ్మిన బాధితురాలు.. వెంటనే ఆ సొమ్మును అతడికి ట్రాన్సఫర్ చేసింది.




 


క్షవరం అయిన తర్వాత వివరం తెలిసినట్లు.. కొద్ది రోజుల తరువాత కిరణ్​ మోసాన్ని గ్రహించింది ఆ మహిళ. దీంతో ఎవ్వరికి చెప్పకుండా.. క్యాబ్​ డ్రైవర్​ను దూరం పెట్టింది. ఏప్రిల్​లో ఆమెకు మళ్లీ ఫోన్ చేసిన కిరణ్.. తన వద్ద ఉన్న బంగారాన్ని ఇవ్వమని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ రోజు క్యాబ్​లో​ తన స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని ఆమె భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు.. 750 గ్రాముల బంగారాన్ని నిందితుడికి ఇచ్చింది. కొంత కాలంగా ఇంట్లో అభరణాలు కనిపించకపోవడం వల్ల బాధితురాలిని నిలదీశాడు ఆమె భర్త. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం భర్తకు వివరించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి.. రామమూర్తినగర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్సఘట్టలో నివాసం ఉండే కిరణ్​ను అదుపులోకి తీసుకున్నారు.




Tags:    

Similar News