వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామన్న మమతా బెనర్జీ ప్రకటనతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. మమతాతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. దీదీ లేకుండా ఇండియా కూటమిని ఊహించలేమని స్పష్టం చేసింది. రాహుల్ సైతం మమతా తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలని.. బెంగాల్లో టీఎంసీతో కలిసి పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మాత్రం మమతా దయాదాక్షిణ్యాలతో తమకు పోటీ చేయాల్సిన అవసరం లేదని అనడం గమనార్హం.
కాగా అంతకుముందు బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వివరించారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగాల్లో సీట్ల పంపకాలపై తన ప్రతిపాదనలను ఇండియా కూటమి సమావేశంలో తిరస్కరించినట్లు టీఎంసీ అధినేత్రి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. కాగా 42 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్కు 2 ఇవ్వాలని మమతా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.