16వేల గుండెల్ని బాగుచేశాడు.. చివరకు గుండెపోటుకే బలయ్యాడు..

Update: 2023-06-08 03:24 GMT

ఆయనో ఫేమస్ కార్డియాలజిస్ట్. గుజరాత్ జామ్ నగర్లో ఆ డాక్టర్ పేరు తెలియనివారుండరు. ఎన్నో వేల గుండెలకు ఆపరేషన్లు చేసి బాగుచేశారు. హార్ట్ ఎటాక్ లపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుండె జబ్బులను నయం చేసే ఆ డాక్టర్ అనూహ్యంగా గుండెపోటుతో కన్నుమూయడం విషాదం.

నిద్రలోనే

జామ్‌నగర్‌కు చెందిన డాక్టర్ గౌరవ్ గాంధీ (41) కార్డియాలజిస్ట్‌. ఆ ప్రాంతంలో ఆయన గురించి తెలియనవారు ఉండరు. దాదాపు 16 వేల మందికిపైగా రోగులకు ఆయన హార్ట్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి వరకు పేషెంట్లను చూసిన గౌరవ్ జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి వెళ్లారు. డిన్నర్ చేసి రాత్రి 11గంటల సమయంలో బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయారు. నిత్యం ఉదయం 6గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే డాక్టర్ గౌరవ్ మంగళవారం ఆరు దాటినా రూం నుంచి బయటకు రాలేదు. వర్షం కారణంగా వాకింగ్ కు వెళ్లలేదని కుటుంబసభ్యులు అనున్నారు. దీంతో అతన్ని డిస్ట్రబ్ చేయలేదు. ఉదయం ఏడు దాటినా నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఉలుకూపలుకూ లేకపోవడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు.




 హార్ట్ ఎటాక్తో మృతి

డాక్టర్ గౌరవ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు చెప్పారు. మొరాయించిన ఎన్నో గుండల్ని బాగుచేసిన డాక్టర్ గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి అందరితో కలిసి డిన్నర్ చేసిన ఆయన ఉదయానికి విగత జీవిగా మారడం తట్టుకోలేకపోతున్నారు. డాక్టర్ గౌరవ్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలులేవని వారు చెబుతున్నారు. 41ఏండ్ల వయసులోనే 16వేల హార్ట్ సర్జరీలు చేసిన డాక్టర్ గౌరవ్ ఇక లేరన్న విషయం తెలిసి డాక్టర్లతో పాటు ఆయన పేషెంట్లు దిగ్బ్రాంతికి గురయ్యారు.

సొంతూరిలో ప్రాక్టీస్

1982లో పుట్టిన గౌరవ్ జామ్ నగర్ లోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం అహ్మదాబాద్ లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేశారు. తర్వాత సొంతూరిలోనే డాక్టర్ గా సేవలు అందించడం మొదలుపెట్టారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు 16వేల యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ సర్జరీలు చేశారు. గుండెపోట్లను అరికడదాం అంటూ పేస్ బుక్ లో చేస్తున్న ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.  

Tags:    

Similar News