ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందగా.. దాదాపు 1200మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఏదైన కుట్ర దాగి వుందా అనే కోణాల్లో సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు సీబీఐ సీల్ వేసింది.
అంతకుముందే స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీంతో బాహానగా బజార్ స్టేషన్‌లో ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ‘‘లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న అనంతరం బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌ను సీబీఐ సీల్ చేసింది. రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్‌ను స్వాధీనం చేసుకున్నందున.. సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించేందుకు స్టేషన్ సిబ్బందికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తదుపరి నోటీసులు వచ్చే వరకు స్టేషన్‌లో ప్యాసింజర్, గూడ్సు రైళ్లు ఆగవు’’ అని అధికారులు ప్రకటించారు.
బాహానగా బజార్ స్టేషన్ మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్లో భద్రక్ - బాలేశ్వర్, హావ్‌డా- భద్రక్, ఖరగ్‌పూర్- ఖుర్దా రోడ్ వంటి ఏడు ప్యాసింజర్ రైళ్లతోపాటు కొన్నిసార్లు గూడ్సు రైళ్లు ఆగుతాయి. ఇక సిగ్నలింగ్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ భావిస్తోంది. ఈ దుర్ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా 82 పార్థివదేహాలను గుర్తించలేదు. మరోవైపు.. ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు అధికారులు తెలిపారు.