Central Government : పెన్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం..వారికి తీపికబురు

Update: 2024-01-30 03:07 GMT

పెన్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పెన్షన్‌దారులకు తాము చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్‌ను భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందే హక్కును కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకూ తన మరణానంతరం కేవలం భర్తకు మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది. ఆ తర్వాత భర్త మరణించిన తర్వాతనే పిల్లలకు పెన్షన్ వచ్చేది. అయితే ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

పెన్షన్ రూల్ ప్రకారంగా 2021కి సంబంధించిన సీసీఎస్ నిబంధనను కేంద్రం సవరణ చేసింది. ఒక మహిళా ఉద్యోగి తన భర్తకు బదులుగా వారి కొడుకులు, కుమార్తెలను కుటుంబ పెన్షన్ కోసం నామినేట్ చేసే హక్కును కేంద్రం ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన సవరణను గురించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యేక హక్కును కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వివాహంలో వైరుధ్యాలు వచ్చి విడాకులు తీసుకున్న మహిళా ఉద్యోగుల పెన్షన్ కూడా తమ మరణానంతరం భర్తకే వచ్చేది. చాలామంది మహిళా ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ జీవిత భాగస్వామికి బదులుగా వారి మరణం తర్వాత పిల్లలకు పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థించారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మహిళా పెన్షనర్ల సంక్షేమం కోసమే సవరణ చేపట్టి వారి పిల్లల్ని పెన్షన్ కోసం నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Tags:    

Similar News