Central Government: ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
ఉల్లిగడ్డ ధరలు అదుపుచేసేందుకు కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 29 (ఆదివారం) నుంచి డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా ఉల్లిగడ్డను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఈ ఏడాది ఉల్లి నారు ఆలస్యం కావడం, దిగుబడి వచ్చేందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశముండటంతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ. 80 వరకు పలుకుతోంది. ఇ-కామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లలో రూ.67 చొప్పున విక్రయిస్తుండగా.. చిన్న వ్యాపారులు కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ కిలో ఉల్లి రేటు రూ.50 నుంచి 60పైనే పలుకుతోంది. ధరల కట్టడిలో భాగంగా కేంద్రం ఇప్పటి వరకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ రిలీజ్ చేసింది.