independence day : మణిపూర్ తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. దేశం వారి వెంటే : మోదీ
దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. శాంతి ఒక్కటే అక్కడి సమస్యలకు పరిష్కారమని చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత మోదీ ప్రసంగించారు. కొన్ని సార్లు చరిత్రలో చిన్న సంఘటనలు దీర్ఘకాలిక విపరిణామాలకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని ఏ శక్తికీ ఇండియా భయపడదని, తలవంచదని మోదీ స్పష్టం చేశారు. ‘‘కొన్ని రోజులుగా మణిపుర్లో హింస చెలరేగుతోంది. ఈ హింసలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి తల్లులు, కూతుళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు’’ అని మోదీ అన్నారు. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి.. చర్యలు చేపడితే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని మోదీ అన్నారు.దేశం వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయల కల్పన, విదేశా వాణిజ్యం సహా అన్ని రంగాల్లో ముందంజలో దూసుకుపోతోందన్న మోదీ అన్నారు. సామాన్యులకు భారం కాకుండా ఆదాయ పన్నుపరిమితిని పెంచామన్నారు. డిజిటల్ విప్లవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని, ప్రపంచాన్ని మార్చడంతో భారత్‌ది కీలకపాత్ర అని తేల్చి చెప్పారు.
‘‘మన ఎగుమతులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. పేదలకు జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి దేశం కట్టుబడి ఉంది. జన ఔషధితో కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచాం. 2 కోట్ల మంది మహిళను లక్షాధికారులను చేయడమే మన లక్ష్యం. దేశ ప్రగతితో మహిళా శక్తి కీలకం. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అమ్మాయిలు ముందంజలో ఉన్నారు. కరోనా తర్వాత భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసివచ్చింది. మానవాళి వికాసమే మనదేశ ఆశయం. ప్రపంచానికి కొత్త నమ్మకం కలిగించాం’’ అని అన్నారు.