Hemant Soren : జార్ఖండ్‌లో పొలిటికల్ హీట్..కొత్త సీఎంగా చంపై సోరెన్
సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో జార్ఖండ్‌లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నగదు అక్రమ రవాణా కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు విచారించారు. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపడంతో కొత్త సీఎం అంశం తెరపైకి వచ్చింది. జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపై సోరెన్‌ను ప్రతిపాదించినట్లుగా ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్ ఠాకూర్ తెలిపారు. తదుపరి సీఎంగా చంపై సోరెన్‌ను మీడియాకు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ కూడా తదుపరి సీఎం చంపై సోరెన్ అని తెలిపారు. శాసనసభాపక్ష నేతగా చంపైను తమ కూటమి ఎన్నుకుందన్నారు. గత రాత్రి జార్ఖండ్ తదుపరి సీఎం ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. తదుపరి సీఎంగా చంపై సోరెన్ పేరు, హేమంత్ భార్య కల్పనా సోరెన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సోరెన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో చివరికి ఆయన్నే సీఎంగా ప్రతిపాదించారు.
ఇకపోతే ఈ చంపై సోరెన్ జార్ఖండ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయనది సరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్‌గోడ గ్రామం. సిమల్ సోరెన్ అనే రైతు పెద్దకొడుకే ఈ చంపై సోరెన్. గతంలో తండ్రితో పాటు వ్యవసాయం చేసేవారు. చంపై సోరెన్ 10వ తరగతి వరకూ చదువుకున్నారు. చిన్నవయసులోనే ఆయనకు వివాహం అయ్యింది. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. 90వ దశకంలో చంపై సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు జార్ఖండ్ టైగర్‌గా పేరుంది.