Chanda Kochhar: వీడియోకాన్‌ కుంభకోణం కేసులో చందా కొచ్చర్‌కు ఊరట

Byline :  Veerendra Prasad
Update: 2024-02-06 14:37 GMT

ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో' ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. 2023 జనవరి 9న కొచ్చర్ దంపతులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సబబేనని స్పష్టం చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరం అంగీకరించకపోవడమంటే విచారణకు సహకరించడం లేదని అర్థం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ CEO & మేనేజింగ్‌ డైరెక్టర్ చందా కొచ్చర్‌ గత నెల జనవరి 10 న జైలు నుంచి విడుదలయ్యారు. వీడియోకాన్ గ్రూప్‌నకు (Videocon Group) అక్రమ పద్ధతిలో రుణాల జారీ కేసులో అరెస్టై, ముంబైలోని జైలులో ఉన్నారు చందా కొచ్చర్‌ & ఆమె భర్త దీపక్‌ కొచ్చర్. దాదాపు రెండున్నర వారాలు జైలు జీవితం అనుభవించాక వారు తాత్కాలిక స్వేచ్ఛను పొందారు.

బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను ఉల్లంఘించి... వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందనేది CBI ఆరోపణ. దీనికి ప్రతిగా... ధూత్ 2010 నుంచి 2012 మధ్య దీపక్ కొచ్చర్ కంపెనీలో రూ. 64 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో... అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సహా భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఒక FIRను CBI నమోదు చేసింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌తో పాటు... దీపక్ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్ రెన్యూవబుల్స్ (NRL), సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కూడా నిందితులుగా ఆ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆరోపణలు చుట్టుముట్టడంతో, ఐసీఐసీఐ బ్యాంక్ CEO & మేనేజింగ్‌ డైరెక్టర్ పదవికి 2018 అక్టోబర్‌లో అవమానకర రీతిలో చందా కొచ్చర్ రాజీనామా చేశారు. తొలుత ఆ రాజీనామాను అంగీకరించిన బ్యాంక్‌, తామే ఆమెను తొలగిస్తున్నట్లు ఆ తర్వాత ప్రకటించింది.

Tags:    

Similar News