Ayodhya Ram : కిష్కింద నుంచి అయోధ్యకు చేరుకున్న రామయ్య రథం
కర్ణాటక హంపీలోని కిష్కింధ నుంచి ప్రత్యేకరథం అయోధ్యకు చేరుకొంది. శ్రీరాముడి కోసం రూపొందించిన ఈ ప్రత్యేక రథం దేశంలోని ఆలయాలన్నింటినీ సందర్శించుకొని వచ్చింది. సీతమ్మ జన్మస్థలి నేపాల్‌లోని జనక్‌పురికి సైతం వెళ్లిన ఈ రథం శుక్రవారం రామయ్య సన్నిధికి చేరింది. రాముడి చిత్రాలున్న కాషాయ జెండాలు చేతబట్టిన భక్తుల బృందం ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ ఈ రథాన్ని అయోధ్యకు చేర్చారు. మూడేళ్ల క్రితం మొదలైన ఈ రథయాత్ర శుక్రవారంతో ముగిసింది.
రామయ్య రథం గత రెండు నెలల్లో అనేక ప్రాంతాలను చుట్టి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలోని సరయు నదీ తీరాన ఈ రథాన్ని నిలిపారు. దీంతో ఆ రథాన్ని దర్శించేందుకు భక్తులు, పర్యాటకులు తరలి వస్తున్నారు. రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రథంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవీ, హనుమాన్, హంపి విరూపాక్షుడు, హనుమాన్ తల్లి అంజనీ విగ్రహాలు ఉన్నాయి. కిష్కింధకు చెందిన భక్తులు ఏటా దేవ్ దీపావళి రోజున అయోధ్యను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కిష్కింధలో రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో 215 మీటర్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించాలని భావిస్తోంది. వచ్చే ఆరేళ్లలో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.